*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, June 6, 2014

మానుమల్లి కమ్మదనం

"మన భూమి మల్లాంలో గుండ్రంగా ,జల్లల దొరువులో చదరంగా 
ఉంటాది." అంటారట  ప్రళయ కావేరి వొడ్డున పెరిగే గడుగ్గాయిలు ! 
 ఇలాంటి చెణుకులుఎన్నో స వెం రమేశ్ గారి కలం విదిలింపుల్లో!
 తిట్లు చెట్లు వ్యవసాయ పనిముట్లు,,వానకోయిల మద్యపానం , చీమక్క దోమక్క కాకమ్మ గువ్వమ్మ .. మూలికలు మూలవైద్యాలు , డా.అగరం వసంత్ గారి రాతల కోతలు.. జీవన వెతలు ...జీవిత కతలు .. "తెల్ల కొక్కెర్ల తెప్పం
"మా ఎత్తీస్తారా? " అన్న ప్రశ్న నుంచి పుట్టిన "కడసీ కోరిక" "ఆ అడవంచు పల్లెలో " "పదహారు పొద్దులు "  అత్తవాన పొంగలి  " పెట్టి "పాటల పెట్టి" రాగాలు తీసే "గూడూ చెదిరిన అవ్వ" కతలు ... ఎర్నూగు పూలు ..విజయ లక్ష్మి గారు ఈ  " ఎర్నూగులు"గా పిలవబడే వెర్రి నూగుల పూల సౌందర్యాన్ని తలపింప జేసే  ఈ భాషా సౌందర్యం , గాసటను పోగొట్టి సేద తీర్చే చల్ల గాలిలా ,
కథలనంతా కమ్ముకొని ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అని అంటారు విజయ లక్ష్మి గారు. 

 తెలుగు ,తమిళ, కన్నడ ప్రాంతాలలో మూడు ముక్కలైన తెలుగు బతుకుల వెలుగులు ఒకటే అని గుర్తించ మంటాయి. " మొరుసు నాడు కతలు"
ఇక, "ఇరుల దొడ్డి కతలు  గిరిజనులతో పెనవేసుకొని పోయినవి. నంధ్యాల నారాయణరెడ్డి గారి చమత్కారాలు. జీవితం తో ముడిపడిన  పర్ధాన్ గోండుల జీవిత కతలు. బన్నేరు గట్ట అడవీ ప్రాంతం , గేదర చెట్లు 
, ఆ కొండల బండల మీద చిన్నపాటి చెరువంత దొనలు , పాండవగవులు, మాగడి కెంప రాయడి కోట, కైవారం నారాయణ తాత పాట.. వెరశి " ఇరుల దొడ్డి కతలు" పార్దీవ  శరీరాలను విడిచివచ్చే పాండవగవులు , బౌద్ధం ఆనవాళ్ళు అంటారు విజయ లక్ష్మి గారు. 

ఇక, చెన్న పట్నం చేరి  చెడే వాళ్ళ ను విన్నామే కానీ,
చెడి చెన్న పట్నం చేరిన వారి కతలు తెలుసుకోవాలంటే,  ఇంట్లో తెలుగు వీధిలో తమిళం  మాట్లాడుకొనే  తొండనాడు జీవితాలు, తెలుసుకోవాలంటే   తొండనాడు కతలు."  చదివి తీరాల్సిందే మరి.

ఇందులో , తొండనాడు ప్రాంతపు తమిళ కతల తెలుగు అనువాదాలు కూడా ఉండడం విశేషం .

ఇక ,అన్నిటికీ తలమానికం  " శ్రీ రాయంగల శ్రీ కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్  గారు, తమిళులు అభిమానం గా పిలుచుకొనే మాండలిక పితమహుడు ,కీరా,   తమిళం లో రచించిన " గోపల్ల గ్రామం" అనువాదం " గోపల్లె . ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అంటారు విజయ లక్ష్మి గారు.
వందలాది సంవత్సరాల క్రితం తమిళ నాట ,రేగడి ప్రాంతానికి చేరుకొన్న తెలుగు వారు ,అక్కడ వారి జీవన పోరాటం గోపల్లె నవల .నంధ్యాల నారాయణ రెడ్డి గారి అనువాదంలో . 
***. 
ఇన్ని పుస్తకాల కతలూ పొరుగు  తెలుగు కతలు పేరిట  ఒక్క చోట అందించిన వారు డా. రాయ దుర్గం విజయ లక్ష్మి గారు. ఇవి చెన్నై ఆకాశవాణి  సాహిత్య కార్యక్రమాలలో ప్రసారం చేయబడిన రేడియో ప్రసంగాలు. నాగసూరి వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమ నిర్దేశకులే కాక, ఈ ప్రసంగాల సంకలనానికి ముందుమాట కూడా రాసారు. 
వారంటారు , ప్రతి సమీక్ష ఎలా ఉండాలంటే ," సంక్షిప్తంగా ,సరళంగా, నిరక్షరాస్యులు అందుకొనేలా , రేడియో ప్రసంగంలా ఉండాలి అని  " ఈ రచనలను చదివితే, "రేడియో కోణంలో సిద్దించే శిల్పం ఏమిటో అవగతమవుతుంది. సవ్యంగా ఒదిగిపోవడంసరిపోదు ,అది వేగంగా కూడా నడవాలి " అంటూ నాగసూరి , ఆ దిశగా విజయ లక్ష్మి  గారి కృషిని వివరించారు ." విజయ లక్ష్మి గారు నిజమైన విద్యార్థిలా శ్రమించారు. నమ్రతగా కృషి చేశారు. సాహిత్యం ,భాష అనే దృష్టి కాకుండా కథల్లో చిత్రించిన జీవితం ఏమిటో చెప్పాలని.  కనుక విషయం ,వివరించవలసిన కోణాలు విశేషంగా ఉంటాయి. ఇందులో ఒక రచయిత కాకుండా పలువురు రాసిన  కథలే ఎక్కువ. "

సుక్క పుట్టే పొద్దు ,కన్ను కొరికే పొద్దు   అంటూ పొద్దు పొడిచే దగ్గర నుంచీ పొద్దుగూకే వరకు సాగే  జీవితాలు ,   వంపులు తిరిగే వంకలకు  పెట్టుకొన్న చక్కటి తెలుగు పేర్లు ,తల్లి వంక , తండ్రి వంక ,అన్నదమ్ముల వంక, అక్కచెల్లెళ్ల వంక ... ఆపై ఇంగ్లీషు పదాలకు తెలుగులో పిలుచుకొనే సృజనాత్మకత.... మిన్నులివు ( రేడియో) ,అల పలుకి (టెలిఫోన్) ,చే పలుకి ( సెల్ ఫోన్)... చదువుతున్న కొద్దీ ,
 తల్లి నుడిపై వారికున్న మమకారంతో వ్యక్త పరుస్తూనే, మనకొక హెచ్చరిక గా నిలబడతాయి ఈ పొరుగు తెలుగు కతలు. 
నిస్సందేహంగా.  
          "గాలి వాన కు పడిపోయినా ,ఒళ్ళంతా చిగురించి తలెత్తుకొని తన ఉనికిని  సగర్వంగా చాటుకొనే మానుమల్లి  పూలవాసనలు మనసంతా ఆక్రమిస్తాయి. "
 మరో సారి .


                                     ప్రతులకు
    చేపలుకి :            
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com

***


No comments: